వనరు
బ్లాగ్ నుండి డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి
బ్లాగ్ను మానిటైజ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ బ్లాగ్ నుండి డబ్బు సంపాదించడానికి విభిన్న ఆన్‌లైన్ ఆదాయ నమూనాలు, ప్రముఖ వ్యూహాలను కనుగొనండి.
మీకు బ్లాగ్ లేదా సైట్ ఉంటే – లేదా మీరు మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉంటే – దాని నుంచి డబ్బు సంపాదించడానికి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. బ్లాగ్‌ను మానిటైజ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కథనం, వివిధ ఆన్‌లైన్ ఆదాయ నమూనాలను, డిజిటల్ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి ఉపకరించే ప్రముఖ వ్యూహాలను కవర్ చేస్తుంది.
ప్రాథమిక అంశాలతో మొదలు పెడదాం. మానిటైజేషన్ అంటే ఏమిటి? సులభంగా చెప్పాలంటే, మానిటైజేషన్‌కి అర్థం మీ సైట్ ద్వారా డబ్బు సంపాదించడం. మీ బ్లాగ్‌లో వున్న ఆన్‌లైన్ కంటెంట్ నుంచి మీరు డబ్బు సంపాదించగలిగితే, అదే మానిటైజేషన్.
మీ బ్లాగ్ నుంచి డబ్బు సంపాదించడం మొదలు పెట్టడానికి ఆన్‌లైన్ వ్యాపార నమూనాలు ఎన్నో ఉన్నాయి:
- ప్రకటనలు
- అనుబంధ మార్కెటింగ్
- నిజరూపంలో లేదా డిజిటల్ రూపంలో అందించే ఉత్పత్తి
- సభ్యత్వాలు
- శిక్షణ
ఇవి మీకు, మీ బ్లాగ్‌కి పనికి వచ్చేలా మీరు ఎలా చేయగలరు? ఒక్కో మానిటైజేషన్ నమూనాను వివరంగా పరిశీలిద్దాం
ప్రకటనల మానిటైజేషన్: డబ్బు సంపాదించడానికి, మీ బ్లాగ్‌లో ప్రకటనలను ఆఫర్ చేయండి
బ్లాగ్ ప్రచురణకర్తగా, మీ ఆన్‌లైన్ కంటెంట్‌కు ప్రకటనలు మీకు మంచి ఆదాయ మార్గం కాగలవు. మీ ప్రేక్షకుల దృష్టిలో పడటం కోసం ప్రకటనకర్తలు డబ్బు చెల్లించడానికి సుముఖంగా వుంటారు. అత్యధిక ప్రజాదరణ పొందిన ఒక వార్తాపత్రిక ఎలా అయితే ప్రకటనకర్తల నుంచి అధిక మొత్తాన్ని పొందగలదో, అదేవిధంగా మీ సైట్, మీ కంటెంట్ ఎంత ఎక్కువ ప్రాచుర్యం పొందగలిగితే మీరు అంత ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు.
మీ కంటెంట్‌తో పాటు ప్రకటితమవ్వాలని కోరుకునే వ్యాపార సంస్థలకు నేరుగా మీరు ప్రకటన స్థలాన్ని ఆఫర్ చేయవచ్చు. దాన్నే ప్రత్యక్ష డీల్ అంటారు. మీ తరపున మీ ప్రకటన స్థలాన్ని విక్రయించడానికి మీరు Google AdSense వంటి ప్రకటన నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మీ బ్లాగ్ యొక్క నిర్దిష్ట పేజీలో కనిపించే కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలను అందించడం ద్వారా AdSense పనిచేస్తుంది. ఉదాహరణకు, మీ బ్లాగ్ సాహస ప్రయాణం గురించైతే, అలాగే మీరు రేక్యావిక్ పర్యటన గురించి ఒక పోస్ట్‌ను అప్‌లోడ్ చేస్తే, AdSense ప్రయాణ బీమా, ఐస్లాండ్ లేదా వెచ్చని దుస్తులకు సంబంధించిన ఒక ప్రకటన కనపడవచ్చు. ప్రకటన కనిపించే సైట్ యజమానిగా, ఒక యూజర్ ఆ ప్రకటనను చూసినప్పుడు లేదా దానితో ఇంటరాక్ట్ అయినప్పుడు, కొంత మొత్తాన్ని AdSense మీకు చెల్లిస్తుంది.
మీ బ్లాగ్ యొక్క కంటెంట్ మరియు రీడర్‌షిప్‌కు ఆన్‌లైన్ ప్రకటనలను సంబంధితంగా చేయగల సామర్థ్యంతో, చాలా మంది ప్రకటనదారులు మీ ప్రకటన స్థలం కోసం ప్రీమియం ధర చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారు.
అనుబంధ మార్కెటింగ్: ఉత్పత్తి సిఫార్సుల ద్వారా ఆదాయాన్ని సంపాదించండి
మరొక సైట్‌లో అమ్మబడుతోన్న ఏదైనా ఒక ఉత్పత్తి లేదా సేవకు తీసుకెళ్లేలా మీ కంటెంట్‌లో ఒక లింక్‌ను చేర్చినప్పుడు, దానిని అనుబంధ మార్కెటింగ్ అంటారు. అది ఇలా పనిచేస్తుంది: ఎవరైనా మీ సైట్‌లోని లింక్‌ను క్లిక్ చేసి, అనుబంధ సైట్‌కు వెళ్లి, మీరు ఆమోదించిన ఉత్పత్తిని కొనుగోలు చేస్తే, ఆ అమ్మకంపై మీరు కమీషన్ పొందుతారు.
ఉత్పత్తి సిఫారసులపై ఆసక్తి ఉన్న వ్యక్తులు కలిగిన బ్లాగుల కోసం, ఇది ఆచరణీయ ఆదాయ నమూనా. వివిధ రకాల కథనాలలో, సమాచారాన్ని చేరవేసేవి, ఎలా చేయాలో నేర్పేవి, జీవనశైలిని ప్రతిబింబించేలా ఉండేవి, అనుబంధ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చాలా అవకాశాలను అందిస్తాయి.
సాహస ప్రయాణ బ్లాగ్ ఉదాహరణను ఉపయోగించి, మీరు అడవుల్లోని ఈత ప్రదేశాల పర్యటన గురించి కథనాన్ని పోస్ట్ చేశారనుకోండి. మీ పర్యటన కోసం మీరు ప్యాక్ చేసుకున్న స్విమ్ సూట్, టవల్ మరియు కళ్లజోడు వంటి వస్తువులను సిఫార్సు చేయడానికి మీరు అనుబంధ మార్కెటింగ్‌ను ఉపయోగించవచ్చు. బ్లాగ్ పాఠకుడు మీరు సిఫార్సు చేసిన స్విమ్‌సూట్ లింక్‌పై క్లిక్ చేసి, దానిని కొనుగోలు చేసినప్పుడు, మీరు మీ బ్లాగ్ నుండి ఆదాయాన్ని పొందుతారు.
మీరు మీ ప్రేక్షకుల విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారని నిర్ధారించుకోవడానికి, మీ అనుబంధ సంబంధాల గురించి పారదర్శకంగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. చాలా దేశాలలో, ఆర్థికంగా మీతో అనుబంధమున్న సంస్థలను బహిర్గతం చేయడం అనేది, చట్టపరమైన అవసరం కాబట్టి, అనుబంధ మార్కెటింగ్‌లో పాల్గొనడానికి ముందు న్యాయ సలహాదారులతో చర్చించడం మర్చిపోవద్దు. మీరు ప్రచారం కల్పిస్తున్న ఉత్పత్తి లేదా సేవ మీద మీ బ్లాగ్ పేరు ప్రఖ్యాతలు ఆధారపడతాయని గుర్తుంచుకోండి, కాబట్టి మీ అనుబంధ భాగస్వాములను ఎన్నుకునేటప్పుడు నాణ్యతపై దృష్టి పెట్టండి.
భౌతిక లేదా డిజిటల్ ఉత్పత్తి సమర్పణలు: మీ బ్లాగ్ నుండి డబ్బు సంపాదించడానికి వస్తువులను విక్రయించండి
వారి బ్లాగ్‌లను డబ్బు ఆర్జించే మార్గంగా, చాలా మంది బ్లాగర్‌లు ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఉనికిని ఏర్పరచుకుంటారు, ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టిస్తారు మరియు ఉత్పత్తులను అమ్మడం ప్రారంభిస్తారు. మీ ఉత్పత్తులు భౌతికమైనవి లేదా డిజిటల్ కావచ్చు. సాహస యాత్ర బ్లాగ్ ఉదాహరణలో, అన్యదేశ గమ్యస్థానాలకు డిజిటల్ గైడ్‌బుక్‌లను లేదా మీ లోగోను ప్రదర్శించే టీ-షర్ట్‌లను మీరు అమ్మవచ్చు.
మీ ఉత్పత్తులు భౌతికమైనవైనా వర్చువల్ రకానికి చెందినవి అయినా, చెల్లింపులను అంగీకరించడానికి మీరు ఒక వ్యవస్థను సెటప్ చేయాలి. భౌతిక సరుకులను అమ్మడం కోసం మీరు మీ స్టాక్‌ను నిల్వ చేయడం, షిప్పింగ్ నిర్వహించడం, అలాగే పన్నులు, డ్యూటీలను నిర్వహించడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. డిజిటల్ వస్తువులు లాజిస్టిక్‌గా తక్కువ సంక్లిష్టంగా ఉంటాయి ఎందుకంటే అవి ఎలక్ట్రానిక్‌గా పంపిణీ చేయబడతాయి.
సభ్యత్వాలు: కొత్త ఆదాయ మార్గాన్ని జోడించడానికి సాధారణ రుసుమును వసూలు చేయండి
మీరు బ్లాగ్‌లో చేర్చే విషయాల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న యాక్టివ్ కమ్యూనిటీ ఉంటే, చెల్లింపు సభ్యత్వం లేదా సభ్యత్వ నమూనా అనేది, మీ విలువైన కంటెంట్‌ను ఉపయోగించి, దీర్ఘకాలంలో ఆదాయాన్ని సంపాదించడానికి మరొక మార్గంగా ఉంటుంది.
ఈ వ్యాపార నమూనాలో, పాఠకులు నిర్ణీత మొత్తాన్ని సాధారణంగా నెలవారీగా లేదా ఏటా చెల్లిస్తారు. ఈ విధంగా పాఠకుల నుండి సభ్యత్వం లేదా సభ్యత్వ రుసుమును వసూలు చేయడం ద్వారా, మీరు అనేక పర్యాయాలుగా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ రకమైన నిరంతర నగదు ప్రవాహం మరింత స్థిరమైన, ఊహించదగిన మరియు ఖచ్చితమైన ఆదాయ మార్గానికి అవకాశం కల్పిస్తుంది.
బదులుగా, ప్రీమియం కంటెంట్, కమ్యూనిటీ ప్రాంతం, అభ్యాస వనరులు, వీడియోలు లేదా అదనపు సేవలు, సాధనాలను మీరు మెంబర్‌లు లేదా సభ్యులకు అందించవచ్చు. మీరు మీ బ్లాగ్‌కు తగినట్లుగా ఈ అనేక అంశాలను మిళితం చేయవచ్చు.
శిక్షణ: శిక్షణ ద్వారా మీ బ్లాగ్‌ను మానిటైజ్ చేయండి
మీ బ్లాగ్, శిక్షణా సేవలకు తగినది అయితే, ఆన్‌లైన్ కోర్సులు లేదా కోచింగ్ ప్యాకేజీలను ఏర్పాటు చేసి, ఛార్జీలను విధించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
మీరు వీడియోలు లేదా డౌన్‌లోడ్ చేయగల ఇ-బుక్స్ వంటి స్వీయ అభ్యాస బోధనా వనరులను సృష్టించినప్పుడు, మీ ప్రేక్షకులను వారికి వీలైనట్టుగా ముందుకు సాగడానికి మీరు అనుమతిస్తారు. మీ కోర్సు ద్వారా వ్యక్తులు అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇతర విషయాల గురించి వారి ఆసక్తిని మీరు అంచనా వేయవచ్చు.
ఆన్‌లైన్ పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి, ముందస్తుగా ఎక్కువ సమయం, వనరులు అవసరం కాబట్టి, దీన్ని లాభసాటి మార్గంలో నడపడానికి, మీ బ్లాగ్‌తో బాగా ఎంగేజ్ అయ్యే ప్రేక్షకుల అవసరం ఎంతో ఉంది.
మీ ఆదాయాన్ని పెంచడానికి మరొక మార్గం ఏమిటంటే, ప్రత్యక్ష వీడియో శిక్షణను అందించడం, అలాగే మీరు వెచ్చిస్తున్న సమయం కోసం చెల్లింపు పొందడం.
మీ ఆఫర్ ఆన్‌లైన్ కోర్సు లేదా ఆన్-డిమాండ్ కోచింగ్ ఆధారంగా ఉన్నప్పటికీ, మీరు మీ విద్యార్థులతో ఇమెయిల్ ద్వారా లేదా మీ బ్లాగ్‌లలోనే సంప్రదించే అవకాశాలను కూడా చేర్చవచ్చు.
గుర్తుంచుకోండి, మీ బ్లాగ్ నుండి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బ్లాగ్‌ను మానిటైజ్ చేసే పద్ధతులలో ఒక దాని మీద మీరు పట్టు సాధించవచ్చు లేదా మీ వ్యాపారం కోసం ఏది ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి వీలైనన్ని ఆదాయ మార్గాలను కలపవచ్చు, సరిపోల్చవచ్చు. ఆన్‌లైన్ మానిటైజేషన్ గురించి మరింత తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే, మా బ్లాగ్ను సందర్శించండి.